కరోనా తర్వాత అంతటి డేంజరస్ మహమ్మారి మంకీ పాక్స్ రూపంలో మానవాళికి ముప్పుగా తయారుఅవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మంకీ పాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.కరోనా నుంచి ఇంకా తేరుకోకముందే… కొత్త కొత్త వైరస్లు దడ పుట్టిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రాణాంతకమైన ఎబోలా, నిపా, మలేరియా, డెంగీ, జైకా, ఎయిడ్స్, ఏవియన్ ఫ్లూ, వైరల్ హెపటైటిస్, జపనీస్ ఎన్సెఫలైటిస్, వంటి వైరస్లు ఒకదాని వెనుక మరొకటి మనుషులపై దాడి చేస్తున్నాయి. ప్రాణాలు తీసేస్తున్నాయి. ఈ వైరస్లు చాలవా అన్నట్లు కొద్ది రోజులుగా మరో వైరస్ దడ పుట్టిస్తోంది. అదే మంకీ వైరస్. శాస్త్రవేత్తలు దీనిని ఎంపాక్స్‌గా వ్యవహరిస్తున్నారు.
ఫస్ట్ ఆఫ్రికా ఖండానికే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమక్రమంగా ప్రపంచమంతా వేగంగా పాకుతుందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలు గోవిందా అవడం ఖాయమని డబ్ల్యూహెచ్‌వో అలర్ట్ జారీ చేసింది. గతంలోనే ఎంపాక్స్ వైరస్ వెలుగు చూసినా ఈసారి చాలా ప్రమాదకరంగా మారి, ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తోంది. ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్థాన్‌లోనూ ఎంపాక్స్ కేసులు గుర్తించనట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం.
ప్రపంచానికి ముప్పుగా తయారైన ఎంపాక్స్ వైరస్ ప్రస్తుతం ఆఫ్రికాలోని 13 దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం ఆఫ్రికాలోని 95 శాతం కేసులు బయటపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న దేశాలకు సైతం ఈ అంటువ్యాధి వేగంగా వ్యాపిస్తున్నది. కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన మాదిరిగానే ఎంపాక్స్‌లోనూ కొత్త వేరియంట్స్ మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. అదేస్థాయిలో మరణాల రేటు కూడా పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీ కింద పరిగణించింది. గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.