దేశవ్యాప్తంగా సంచనలం సృష్టిస్తోన్న 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలి లైంగికదాడి ఘటనపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కేసును సిమోటోగా తీసుకుని సీజేఐ డీవై చంద్రచూడ్ ఆధీనంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.విచారణ సందర్భంగా జూనియర్, సీనియర్ డాక్టర్ల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది భద్రతకై తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించింది.మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఇవాళ ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. డాక్టర్ల భద్రత గురించి టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే.. వారికి సామాజిక భద్రత కల్పించడమే ఆ టాస్క్ ఫోర్స్ ఉద్దేశంగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా డాక్టర్ల భద్రత గురించి ఏకాభిప్రాయాన్ని క్రియేట్ చేయాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ మేరకు టాస్క్ఫోర్స్ బృందంలోని సభ్యుల పేర్లను కూడా సుప్రీంకోర్టు వెల్లడించింది.
జాతీయ టాస్క్ ఫోర్స్ బృందం జాబితా: సర్జర్ వైస్ అడ్మిరల్ ఆర్ సరిన్, డాక్టర్ డీ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ఎం శ్రీనివాస్ , డాక్టర్ ప్రతిమా మూర్తి, డాక్టర్ గోవర్దన్ దత్ పురి, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ అనితా సక్సేనా, ప్రొఫెసర్ పల్లవి సప్రే , డాక్టర్ పద్మ శ్రీవాత్సవ్ ఉన్నారు. వీరితో పాటు భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వం హోం కార్యదర్శి, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, జాతీయ మెడికల్ కమీషన్ చైర్పర్సన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ ప్రెసిడెంట్ ఆ లిస్ట్ లో ఉన్నారు.
1.ఆసుపత్రుల్లో అత్యవసర గది వద్ద అదనపు భద్రత అవసరం కావొచ్చు.
2.ఆసుపత్రుల్లో బ్యాగేజీ స్క్రీనింగ్ చేయాలి.
3.రోగులు కాకుండా.. ఆసుపత్రి లోపలికి పరిమితికి మించి వ్యక్తులను అనుమతించకూడదు.
4.ఆసుపత్రుల్లో రద్దీని నియంత్రించడానికి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి.
5.వైద్యులు, నర్సులకు విశ్రాంతి కోసం ప్రత్యేకంగా వసతి కల్పించాలి. అలాంటి ప్రాంతాల్లో బయోమెట్రిక్స్, ఫేషియల్ రికగ్నిషన్ ఏర్పాటు చేయాలి.
6.ఆసుపత్రి ప్రాంగణంలో లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
7.వైద్య నిపుణుల కోసం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య రవాణా సౌకర్యం కల్పించాలి.
8.బాధ, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా వర్క్షాప్లను నిర్వహించాలి.
9.భద్రతా ఏర్పాట్లుకు సంబంధించి ప్రతి మూడు నెలలకోసారి ఆడిట్ చేపట్టాలి.
10.POSH చట్టం వైద్య సంస్థలకు వర్తిస్తుంది కాబట్టి.. అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)ని ఏర్పాటు చేయాలి.
11.వైద్య నిపుణులకు అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలి.