మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్ వెలుగులోకి వస్తుంది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత లేటెస్ట్ అప్‌డేట్ ఫోన్లు వస్తున్నాయి. దీంతో చాలా మంది వెనువెంటనే ఫోన్‌లను మారుస్తున్నారు. దీంతో సహజంగానే పాత ఫోన్‌లను పక్కన పెట్టేస్తుంటారు. ఒకప్పుడు వాడిన ఫీచర్ ఫోన్స్ ప్రస్తుతం ఎదుకు పనికిరాని వాటిగా మారిపోయాయి. అయితే ఇటీవల ఇలాంటి ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొందరు వస్తున్నారు..పనికిరాని ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఇటీవల కొందరు వస్తున్నారు. టీ కప్పులకు, కొంతమేర డబ్బులు ఇస్తామంటూ వీధుల్లో తిరుగుతూ ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే పనికిరాని ఫోన్‌లను వీళ్లు ఎందుకు కొనుగోలు చేస్తున్నారనే సందేహం రావడం సర్వసాధారణం కదూ.
ఇలా కొనుగొలు చేసే ఫోన్‌లను కేటుగాళ్లు నేరాలకు ఉపయోగిస్తున్నారని తెలుసా.? అవును రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటూ దోపిడీలకు దిగుతోన్న సైబర్ నేరస్థులు ఇప్పుడీ పాత ఫోన్‌ల దందాకు తెర తీశారు. ప్రజల దగ్గర కొనుగోలు చేసిన పాత ఫోన్‌లను రిపేర్ చేయించి వాటితో సైబర్ నేరగాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాత ఫోన్‌లోని డేటాతో పాటు, ఆ ఫోన్ సహాయంతో నేరాలకు పాల్పడుతున్నారని కనిపిస్తుంది.
ఈ ఫోన్లను బీహార్ మీదుగా.. దేవ్ ఘర్, జామ్ తారా, జార్ఖండ్ కు ఈ ముఠా తరలిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులకు పాత ఫోన్‌లను విక్రయించకూడదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్‌ల ద్వారా నేరాలకు పాల్పడితే.. ఐఎమ్‌ఈఐ నెంబర్ ద్వారా ఫోన్ ఎవరిదన్న విషయం ఇట్టే తెలిసే అవకాశాల ఉంటాయి. అందుకే ఈ పాత ఫోన్‌లను నేరాలకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా గోదావరిఖని చెందిన పోలీసులు పాత మొబైల్స్ కొనే ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా వద్ద 3 గోనె సంచుల్లో 4 వేల మొబైల్ ఫోన్లు లభ్యమయ్యాయి. బీహార్‌కు చెందిన మహమ్మద్ షమీ, మహమ్మద్ ఇఫ్తికర్, అబ్దులు సలాంలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ముఠా గత కొన్ని రోజులుగా తెలంగాణలోని పలు గ్రామాల్లో పాత ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.