తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసుకుంటూ మందుకు వెళ్తుంది.దీనిలో భాగంగా తాజాగా ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా.. రూ.2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో రైతుల రుణాలు మాఫీ చేశారు. ఇందుకోసం ఏకంగా 31 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఇక ఈ హామీ అమలు తర్వాత అన్నదాతలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మరో హామీ.. ఎకరానికి ఇంత అని అందించే పెట్టుబడి సాయం అందించే పథకం రైత భరోసా.గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో దీన్ని అమలు చేసింది. దీని కింద ఎకరాకు 5 వేల రూపాయల పెట్టుబడి సాయం అందజేస్తారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చడంతో పాటు.. దీని ద్వారా అందించే మొత్తాన్ని కూడా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కోసం ప్రతి ఎకరాకు రూ. 15 వేలు అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మొత్తాన్ని రెండు విడతల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకం అమలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ కీలక అప్డేట్ వెలువడింది.
రైతు భరోసా విధివిధానల రూపకల్పన కోసం ప్రభుత్వం కమిటీని కూడా వేసింది. తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారైనట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయంలో సాగులో లేని గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతుబంధు సాయం అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణం లో ఈ నిధులు పక్కదారి పట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. రైతు భరోసా పథకం అమలకు లిమిట్ పెట్టాలని భావిస్తోంది.దీనిలో భాగంగా రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే.. 10 ఎకరాల లోపే రైతు భరోసా నిధులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అంతేకాక సాగులో లేని భూములు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగులతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పంట పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో 20 రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.ఇక ఈ పథకాన్ని ఈ సంవత్సరం దసరా నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. రెండు విడతల్లో ఎకరాకు రూ. 7500 చొప్పున మెుత్తం రూ. 15 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అలానే రైతు కూలీలకు రూ. 12 వేల ఆర్థిక సాయంపైనా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. మరి కొన్ని రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రావలసివుంది.