కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.మరోవైపు పలువురు ప్రముఖులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆప్ రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించారు.
ఈ ఘటనపై ఇప్పటి వరకూ విచారణ వేగవంతం కాకపోవడం పై ఆయన లేఖ రాశారు. ఈ లేఖను ఎక్స్ వేదికగా పోస్టు చేసి బెంగాల్ సీఎం, గవర్నర్లను ట్యాగ్ చేశారు. అయితే హర్భజన్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ స్పందించారు. దీనిపై వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజ్‌భవన్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు.ఇది సమాజంలోని ప్రతి మహిళ గౌరవం, భద్రతపై జరిగిన దాడి. వ్యవస్థలో పాతుకుపోయిన మగ అహంకారాన్ని ఈ దాడి కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది. వ్యవస్థలో మార్పులు, అధికారుల వెంటనే చర్యల ఆవశ్యకత అవసరం అని చాటి చెబుతోంది. ప్రజల ప్రాణాలను రక్షించే ప్రదేశంలో ఇంతటి ఘోరం జరగడం.. దిగ్భ్రాంతికరం. ఇది ఆమోదయోగ్యం కాదు” అని లేఖలో హర్భజన్ పేర్కొన్నారు.