జాతీయ క్రీడల్లో మంచి ప్రతిభ చూపే క్రీడాకారులను గౌరవించేందుకు భారత ప్రభుత్వం 1961లో అర్జున అవార్డును ప్రారంభించింది. ఈ అవార్డు ప్రత్యేకంగా క్రీడాకారులకు మాత్రమే ఇవ్వబడుతుంది. కొద్ది రోజుల క్రితం, ఈ అవార్డుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం అప్‌డేట్ చేసింది.
అర్జున అవార్డుకు అర్హత సాధించాలంటే, గత మూడేళ్ల నుంచి అద్భుతమైన క్రీడా ప్రతిభ చూపించి ఉండాలి. అంతే కాకుండా మంచి నడవడిక, క్రమశిక్షణ కూడా ఉండాలి. 2001 నుంచి ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ కప్, కామన్వెల్త్ క్రీడలు, మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రాణించిన క్రీడాకారులు ఈ అవార్డుకు అర్హులు.
ఇటీవల పారిస్ పారా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి ఈ సంవత్సరం అర్జున అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డుల్లో దీప్తి పేరు ప్రత్యేకంగా నిలిచింది.
దీప్తి 400 మీటర్ల టి20 విభాగం ఫైనల్‌లో 55.82 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని మూడో స్థానంలో నిలిచారు. ఈ కృషితో ఆమె తెలంగాణకు ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచారు. దీప్తి అర్జున అవార్డు పొందడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, వరంగల్ ప్రజలు ఆనందంతో ఉప్పొంగుతున్నారు. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీప్తి ఈ అవార్డును స్వీకరించనున్నారు.