కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలిక గేటు అమర్చేందుకు ఇంజినీరింగ్ నిపుణుల బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు . ముందుగా.. 75 టన్నుల బరువు ఉన్న ఈ తాత్కాలిక గేటు ఐదు దశల్లో అమర్చేందుకు ప్లాన్ చేశారు. మొదటి దశలో నాలుగు అడుగుల ఎత్తులో మూడు యూనిట్లను ఒకదానికొకటి అతికించి అమర్చనున్నారు. జిందాల్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రెండు క్రేన్ల సాయంతో 60 అడుగుల వెడల్పు.. 20 అడుగుల ఎత్తులో తాత్కాలిక గేటు అమర్చేందుకు సిద్ధమయ్యారు.
అందుకే.. తుంగభద్ర డ్యామ్ తాత్కాలిక గేటు అమర్చే పనులపై దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ తాత్కాలిక గేట్లు అమర్చే ప్రక్రియ సక్సెస్ అయితే.. రాబోయే రోజుల్లో భారీ ప్రాజెక్ట్‌ల విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ముందుకెళ్లవచ్చు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే.. తుంగభద్ర డ్యామ్ గేట్ తాత్కాలిక గేటు అమర్చే పనులు సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
తుంగభద్ర డ్యామ్ దిగువన ఉన్న సుంకేసుల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండిపోవడంతో వందల టీఎంసీల వరద నీరు సముద్రం పాలవుతోంది. దానికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఇంజినీరింగ్ నిపుణులు పెద్ద సాహసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి.. తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటును అమర్చడం చాలెంజింగ్ విషయం. ఎందుకంటే.. భారీ ప్రవాహంలో గేటును అమర్చడం అంత ఈజీ పని కాదు. ఎంతో బరువు ఉన్న ఇనుప గేటును ఫోర్సుగా వెళుతున్న నీటిలో దింపి.. వాటర్ కెమెరాలు.. ఆక్సిజన్ మాస్కులతో కొంతమంది నిపుణులు నీళ్లలోకి దిగి ఆ గేటును దిమ్మమీద అమర్చాల్సి ఉంటుంది.