ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో విమానాశ్రయంలో ఫ్లోరిన్ గ్యాస్ లీకేజీ కావడంతో కలకలం రేగింది. లక్నోలోని సరోజినీనగర్ విమానాశ్రయంలోని కార్గో విభాగంలో గ్యాస్ లీకేజీ కారణంగా విమానాశ్రయంలో గందరగోళ వాతావరణం నెలకొంది.ఈ ఘటన తో ప్రజలను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో విమానాశ్రయ ఉద్యోగులు అపస్మారక స్థితికి చేరుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అధికారుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విమానాశ్రయానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలను కూడా రప్పించారు. విమానాశ్రయంలోని కార్గో ప్రాంతం నుండి ప్రజలందరినీ దూరంగా ఉంచాలని సూచనలు జారీ చేశారు.
ఎయిర్ పోర్ట్ లోపల 1.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్యాస్ ను వైద్య రంగంలో ఉపయోగిస్తారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ‘ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3లోని కార్గో ప్రాంతంలో ఫ్లోరింగ్ లీకేజీ అయ్యినట్లు చెప్పారు. అగ్నిమాపక, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. మూడు బృందాలు కలిసి పనిచేస్తున్నాయి. కొన్ని ఔషధాల ప్యాకేజింగ్ నుండి ఫ్లోరిన్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇక మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.