ఈ మధ్య సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. యువత తాము ఏం చేస్తున్నారో ఒక అవగాహన లేకుండా వీడియోలు తీసి నవ్వులపాలు అయ్యేలా ప్రవర్తిస్తున్నారు . ఆ బాగోతాన్ని సోషల్ మీడియాలో పెట్టి మరీ లైకుల కోసం, షేర్ల కోసం అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. అలాంటి ఒక మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సరదాగా తీశారో.. ఉద్దేశ్యపూర్వకంగా తీశారో తెలియదు కానీ, ఒక వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది . ఆ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి వాటిపై గట్టి చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ముస్లిం మహిళలు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. బుర్కా ధరించి పాత బస్తీ వీధుల్లో నెంబర్ లేని ఓ వాహనంపై యువత తిరుగుతోంది. వాహనం ముందు భాగంలో బుర్ఖా ధరించిన అమ్మాయిలాగా ఒక వ్యక్తి బండి నడుపుతుంటే.. వెనక ఒక అబ్బాయి కూర్చుని ఉన్నాడు. నడిరోడ్డుపై ఆ వాహనంపై తిరుగుతూ అమ్మాయిల్ని చెడాయిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
యువతకు వ్యవస్థపై నిర్లక్ష్యం, సమాజంలో అమ్మాయిలపై చిన్నచూపు ఉండడమే ఇలాంటి విపరీతాలకు కారణం అని మండిపడుతున్నారు. ఒక అమ్మాయి ఇంత బాగా బండి తోలుతుందా అనేలా చూపిస్తూ.. వెర్రిగా నవ్వుతూ నడిరోడ్డుపై విన్యాసాలు చేస్తున్నారు. వేగంగా బండి నడపడం, వాహనం ముందు టైరును పైకి లేపి విచిత్ర విన్యాసాలు చేయడం చూస్తే ఆ వీడియోని కావాలనే సృష్టించారని అర్థమవుతోంది. ఇదంతా ఇలా ఉండగా.. మరో అబ్బాయి వచ్చి బండి తోలుతున్న అమ్మాయి చెంపపై ముద్దు పెట్టుకోవడం మరింత జుగ్సుపకరంగా కనిపించింది. ఇలా ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారి వేషధారణలో అమ్మాయిలాగా నడిరోడ్డు మీద బండి తోలడమే కాకుండా.. సభ్య సమాజం ఛీ కొట్టేలా హద్దులు మీరినట్లుగా ఇలా వీడియోలు తీయడం ఏంటని మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఘటనలపై పోలీసు వ్యవస్థ దృష్టి సారించాలని, యువతను క్రమమైన మార్గంలో పెట్టి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని పాతబస్తీవాసులు దక్షిణ మండలం పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలో ఉన్న యువకులను అరెస్టు చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన పోలీసు యంత్రాంగం ఆ యువకుల కోసం వేట మొదలుపెట్టింది. సోషల్ మీడియాని మన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకు వినియోగించాలి కానీ, ఇలా వెకిలి చేష్టలతో నవ్వులపాలు అయ్యేలా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదు. సోషల్ మీడియాని సరిగా ఉపయోగించుకుంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించవచ్చు. ఇలా ఉన్న పేరును చెడగొట్టుకోవడం దేనికి అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సమాజ విలువను దిగజారుస్తూ, కులమత భావనలను కించపరుస్తూ, అమ్మాయిలను అగౌరవపరిచేలా వ్యవహరిస్తే మాత్రం తగిన శిక్ష పడాల్సిందే అని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.