పంజాబ్ కింగ్స్‌లో వివాదం..కోర్టుకెక్కిన ప్రీతీ జింటా

"Preity Zinta in a courtroom, related to a controversy involving the Punjab Kings IPL team."

ఐపీఎల్ 2025 సీజన్ ముంగిట పంజాబ్ కింగ్స్ టీం లో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. టీమ్ కో-ఓనర్స్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. పంజాబ్ కింగ్స్ టీం లో బాలీవుడ్ నటి ప్రీతీ జింటా, పారిశ్రామికవేత్తలు మోహిత్ బర్మన్, నెస్ వాడియా ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు.అయితే, తన వాటాలోని 11.5 శాతం షేర్లను ఇతర వాటాదారులకు చెప్పకుండా అమ్మేందుకు మోహిత్ బర్మన్‌ సిద్దమయ్యారని, ఆయనను అడ్డుకోవాలని ప్రీతీ జింటా చండీగఢ్ హై కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం అందుతుంది.అయితే ఈ వార్తలను మోహిత్ బర్మన్ ఖండించారు. తాను ఎలాంటి షేర్లను అమ్మడం లేదని స్పష్టం చేశారు.

అయితే ఈ వ్యవహారంపై పంజాబ్ కింగ్స్ తరఫున ఎవరూ స్పందించలేదు. అటు ప్రీతీ జింటా, నెస్‌ వాడియాలు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.కంపెనీ రూల్స్ ప్రకారం వాటాలను అమ్మేసే ముందు బయటి వారికి కాకుండా,భాగస్వాములకు తొలుత ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది. వారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోతే బహిరంగంగా విక్రయించుకోవచ్చు. కానీ, పంజాబ్ కింగ్స్ విషయంలో ఇలా జరగడం లేదని, ప్రీతీ జింటా చట్టపరమైన చర్యలకు ప్రయత్నిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

గతంలో కూడా పంజాబ్ కింగ్స్ సహ యాజమాని నెస్ వాడియా, ప్రీతీ జింటాల మధ్య కూడా గొడవ జరిగింది. నెస్ వాడియా అందరి ముందు తనను తిట్టాడని, కొట్టాడని, చంపుతానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. మళ్లీ ఇన్నాళ్లకు సహా యజమానుల మధ్య గొడవలంటూ వార్తలు వస్తున్నాయి.మరోవైపు పంజాబ్ కింగ్స్ ప్రదర్శన కూడా దారుణంగా ఉంది. 2014 సీజన్‌లో ఫైనల్ చేరిన ఆ జట్టు మళ్లీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసింది లేదు. కోచ్‌లు, కెప్టెన్లు, ఆటగాళ్లు మారినా పంజాబ్ కింగ్స్ తలరాత మారడం లేదు. కనీసం ఐపీఎల్ 2025 సీజన్‌లోనైనా మంచి జట్టును ఎంపిక చేసుకొని మంచి ప్రదర్శన చేయాలని ఆ టీమ్‌ మేనేజ్‌మెంట్ భావించింది. కానీ తోటి యాజమానుల మధ్య జరుగుతున్న గొడవలు ఆ జట్టు అభిమానులను కలవరపెడుతున్నాయి.

Leave a Reply