తెలంగాణ: గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోడుగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను తెలిపారు.
సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్‌లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.
ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఆగస్ట్ 9వ తేదీన ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి పడిపోయింది. దీంతో విద్యార్థిని నడుము భాగంలో తీవ్ర గాయాు అయ్యాయి. గురుకుల అధికారులు కార్తీకను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కి ,అక్కడి నుంచి నిమ్స్ కు తరలించారు. నిమ్స్ న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం(ఆగస్ట్ 13) కార్తీక కు ఆపరేషన్ జరిగింది.
ప్రస్తుతం ఐసీయులో విద్యార్థిని కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. కార్తీక కు కావాల్సిన వైద్యం ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తో మాట్లాడి కార్తీక కోలుకునేంత వరకు వైద్యం అందించాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు.