జనసంచారం అధికంగా ఉండే ప్రాంతంలోకి చిరుత పులి రావడంతో భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు . గత కొద్ది రోజులు శ్రీశైల క్షేత్ర పరిధిలో ఎక్కడో ఒకచోట పలు ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తూనే ఉంది. ఇక, ఈ విషయంపై అటవీశాఖ అధికారులు, దేవస్థానం అధికారులు స్పందించారు.. చిరుత పులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.
శ్రీశైల క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.. ఇటీవల తరచూ జనావాసాల్లో చిరుతల సంచారం స్థానికులతో పాటు భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఆగస్టు 19 సోమవారం రాత్రి నీలం సంజీవరెడ్డి భవన్ దిగువన గేటు ముందు చిరుతపులి నిలుచొని చూస్తున్న దృశ్యాలను కొందరు భక్తులు గమనించారు. భక్తులు కారులో కూర్చొని చిరుతపులి గేటు ముందున్న దృశ్యాలను వారి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అయితే, కారు లైట్లు వేసి వీడియోలు తీస్తుండగా ఆ లైట్ల వెలుతురు పడటంతో చిరుతపులి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.
ఇదిలా ఉంటే, ఈ నెల 13న కూడా శ్రీశైలంలోని పాతాళగంగ మార్గంలో చిరుత కనిపించింది. పాతాళగంగ మార్గంలోని ఆలయ ఏఈవో ఇంటి వద్ద చిరుత కనిపించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఇంటి ప్రహరీ గోడపై చిరుత నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్లిన షాకింగ్ దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేసింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. సరిగ్గా వారం వ్యవధిలోనే మరోమారు చిరుత కనిపించటంతో స్థానికులతో పాటు, భక్తులు సైతం భయాందోళనకు గురవుతున్నారు.