ఆర్దికంగా కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం రిలీఫ్ ఇచ్చింది. రాష్ట్రానికి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది.రాష్ట్రంలో నెలకొన్న ఆర్దిక పరిస్థితుల కారణంగా..కేంద్రం నుంచి నిధుల సమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని మార్గాలను వెతుకుతుంది. అందులో భాగంగా రాష్ట్రం నుంచి తాజాగా అందిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. తొలి విడత నిధులు మంజూరు చేసింది.
కేంద్రం నిధులు:
ఏపీకి కేంద్రం నుండి నిధులు విడుదల అయ్యాయి. రాష్ట్రానికి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ కింద తొలి విడత నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు రూ 1,500 కోట్లను ఏపీకి విడుదల చేసినట్లు రాష్ట్రానికి సమాచారం అందింది. రాష్ట్రంలో ఆర్దిక నిర్వహణ కష్టంగా మారిన వేళ కేంద్రం నుంచి అవకాశం ఉన్న అన్ని మార్గాల్లోనూ నిధుల సమీకరణ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా కేంద్రానికి తాజాగా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ కింద నిధుల గురించి ప్రతిపాదనలు అందించింది.
రూ 1,500 కోట్లు విడుదల:
ఏపీ ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ తాజాగా ఢిల్లీ పర్యటనలో అధికారులతో ఈ మేరకు చర్చలు చేసారు. అన్ని రాష్ట్రాల్లో మూలధన వ్యవయం పెరిగే విధంగా కేంద్రం ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వమే ఇందుకు నిధులు ఇస్తోంది. దాదాపు 50 ఏళ్ల పాటు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్రం రుణం రూపంలో ఈ నిదులను సమకూరుస్తుంది. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే రూ 2,200 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుంది.
బిల్లుల చెల్లింపు కోసం:
కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టు మొత్తం వ్యవయంలో 66 శాతం కేంద్రం విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఈ మేరకు తొలి విడతగా రూ 1,500 కోట్లు ఏపీకి విడుదల అయ్యాయి. జలవనరుల శాఖ, ఆర్ అండ్ బీ, ఇతర శాఖల పరిధిలో చేపట్టే ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. వాటిని పరిశీలించిన తరువాత కేంద్రం ఏపీకి రూ 2,200 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను రాష్ట్రంలో నిర్మాణ పనులు పూర్తి చేసి బిల్లుల కోసం నిరీక్షిస్తున్న కాంట్రాక్టర్లకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.