పుష్ప 2 నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పుష్ప 2 నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌లను అరెస్ట్ చేయరాదని హైకోర్టు పోలీసులకు సూచించింది. అదే సమయంలో దర్యాప్తు కొనసాగించవచ్చునని ఆదేశాలు జారీ చేసింది.
తమ మీద చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రవిశంకర్, నవీన్‌లు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఈ పిటిషన్ పై న్యాయస్థానం మంగళవారం విచారణ చేప్టటింది. తొలుత పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.
థియేటర్ భద్రత పిటిషనర్ల పరిధి కాదన్నారు. తమ బాధ్యత గా ముందే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. సమాచారం ఇవ్వబట్టే అంత మంది పోలీసులు అక్కడ ఉన్నారన్నారు. అన్ని చర్యలు తీసుకున్నపటికి అనుకొని ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న అభియోగాలు ఏవీ వారికి వర్తించవన్నారు.
వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లను అరెస్ట్ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేశారు.