వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో అదిరిపోయే మరో ట్విస్టు చోటుచేసుకుంది.ఆయన ఉంటున్న ఇంటి స్థలం తనదంటూ రిటైర్డ్ టీచర్ చింతాడ పార్వతీశం మీడియాతో వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘నా దగ్గరే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఇంకా నాకు రూ.60లక్షల బకాయి రావాల్సి ఉంది.ఇందుకు సంబంధించిన మూడు చెక్కులు సైతం నా వద్ద ఉన్నాయి. ఈ స్థలం రిజిస్ట్రేషన్‌కు ముందు మా కుటుంబం పేరుతోనే డాక్యుమెంట్లు ఉన్నాయి. వాటిని కావాలంటే చూపిస్తా. ఇంటి స్థలం నాదైతే దువ్వాడ కుటుంబం పోటీపడటం ఏమిటి అని పార్వతీశం అన్నారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద జరుగుతున్న హైడ్రామాకి బుధవారం నాటికి ఆరో రోజుకి చేరుకుంది. ఇంటి బయటే దువ్వాడ వాణి న్యాయపోరాట దీక్ష చేస్తుండగా , శ్రీనివాస్ మాత్రం ఇంటి లోపలే ఉన్నారు. విశాఖలో చికిత్స పొందుతున్న దివ్వల మాధురి సైతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎప్పటిలాగే పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. మంగళవారం రాత్రి దువ్వాడ సోదరుడు బాబా, వాణి బంధువుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు తప్ప అన్ని డిమాండ్లకు తాము అంగీకరిస్తున్నామని బాబా చెప్పగా, డిమాండ్లు పరిష్కారానికి ఆయన ఎవరంటూ వాణి ఎదురు ప్రశ్నించారు.