సాంకేతిక కారణాలవల్ల ఏపీలో రెండు నెలల నుంచి వాలంటీర్లకు జీతం చెల్లించడంలేదని, ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు నివేదిక పంపించినట్లు గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం.శివప్రసాద్ వెల్లడించారు.త్వరలో జరగబోతున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించే అవకాశం ఉందన్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దుచేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా ప్రభుత్వమే వీరికి శిక్షణ ఇస్తుందని, వేతనాన్ని పెంచే అంశంపై పరిశీలన జరుగుతోందన్నారు.
వాలంటీర్లలో అందరూ విద్యావంతులే కావడంతో వారిని ప్రభుత్వంలో మరింత మంచిస్థానాల్లోకి తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం మొదలుపెట్టిందని శివప్రసాద్ తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిందని, వారి ఉద్యోగాలకు ఎటువంటి ఢోకా లేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఫొటోలు తీసే బాధ్యతలను అప్పగించడంపై అనవసరమైన రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలనే మంచి లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగానే వారికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.
వారానికి రెండురోజులు వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది మరుగుదొడ్ల ఫొటోలను ప్రత్యేకంగా యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం అప్పజెప్పిన పనిని శ్రద్ధగా చేయడమే అందరి లక్ష్యమని, దీనిపై అపోహలు ఉండరాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో సచివాలయాలను కూడా ప్రభుత్వం చేర్చిందన్నారు. అలాగే వార్డు, గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వార్డు విద్యా కార్యదర్శి, సంక్షేమ విద్య సహాయకులు కూడా పాఠశాల్లో డైనింగ్ హాల్ ఎలా ఉంది? పరిశుభ్రత ఎలా ఉంది? అనే విషయాలను పర్యవేక్షిస్తారన్నారు.