మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్ప బోతున్నారా? ఏపీ రాజకీయాల నుంచి తప్పుకోబుతున్నారా? తమిళ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయిపోయారా? తమిళ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రోజాకు రూట్ క్లియర్ అయిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలుగునాట రాజకీయాల్లో మంచో చెడో తనదైన ముద్రవేసుకున్న రోజా.. ఇప్పుడు తమిళనాడు లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సినీ నటిగా రోజాకు తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది. ఆ రాష్ట్రంలో రాజకీయాలు, సినీ రంగాన్ని వేరుచేసి చూడలేని పరిస్థితి ఉంటుంది. దీంతో తన సినీ గ్లామర్‌తోపాటు.. తన భర్త సెల్వమణి తమిళనాడుకు చెందిన వారు కావడంతో తమిళనాడు రాజకీయాల్లో రోజా రాణిస్తానని ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.రోజాకు తమిళ భాషపైనా మంచి పట్టుంది. దీంతో అక్కడి రాజకీయాల్లోకి ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వాలనే విషయంపై తన సన్నిహితులతో రోజా కొద్దికాలంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. అవకాశాన్ని బట్టి డీఎంకే లేదా హీరో విజయ్ పార్టీలలో ఏదో ఒక పార్టీ నుంచి ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్న చర్చ నగరి నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది.