తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి.కొన్ని చోట్ల రహదారులు చెరువులను తలపిస్తుంటే.. భారీ ట్రాఫిక్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. మరో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఉత్తర పశ్చిమ బెంగాల్, ఈశాన్య జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతుండటం వల్ల.. ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. రాబోయో మరో 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.