భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అవుతున్నానని తన అభిమానులకు తెలియజేయడానికి శిఖర్ ధావన్ శనివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ను ఎంచుకున్నాడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధావన్.. ఆటకు వీడ్కోలు సమయంలో తన కోచ్లు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజాగా ఆయన విడుదల చేసిన వీడియోలో భావోద్వేగానికి గురైన ధావన్, భారతదేశం కోసం ఆడే తన కల నిజమైందని, ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి, డీడీసీఏకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ అన్ని ఫార్మాట్లలో అనుభవజ్ఞుడైన శిఖర్ ధావన్ టీం ఇండియాకు అత్యంత ఉత్తమ ఓపెనర్లలో ఒకడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు కలిసి అనేక మ్యాచ్ లలో ప్రత్యర్థి బౌలర్లపై మెరుపుదాడి చేశారు.