ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.పీసీసీ అధ్యక్షుడి మార్పు, మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు, పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై గతంలో చాలాసార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు.
ముఖ్య నాయకుల మధ్య ఒక అభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. మంత్రివర్గంలోకి ఆరుగురిని తీసుకునే అవకాశం ఉండగా, ప్రస్తుతం నలుగురికి చోటు ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్సాగర్రావు, వివేక్లలో నలుగురికి అవకాశం లభించవచ్చని అనుకుంటున్నారు.పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేశ్కుమార్గౌడ్, మధుయాస్కీగౌడ్, ఎస్సీల నుంచి సంపత్కుమార్, లక్ష్మణ్కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాంనాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే వర్గీకరణ తీర్పు నేపథ్యంలో లక్ష్మణ్కుమార్కు; ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే బలరాంనాయక్కు; బీసీలకైతే మహేశ్కుమార్గౌడ్కు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గం, పీసీసీ చీఫ్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్.. ఇలా అన్ని పదవులపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.