చాలా టైం నుంచి ప్లాస్టిక్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పర్యావరణానికి ప్రమాదంగా మారుతోంది. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమే కాదు..అత్యంత ప్రమాదకరం. ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, మూగ జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముంది.
ప్లాస్టిక్… ప్లాస్టిక్…ప్లాస్టిక్ ! మన జీవితంలో ఇది అంతర్భాగం అయిపోయింది. వాటర్ బాటిల్ మొదలుకొని… వంటింట్లో వాడే పోపుల పెట్టె వరకు అన్నింటికి ప్లాస్టిక్‌తోనే పని! అది లేకుండా ఏ పనీ కాదు. అడుగు ముందుకు పడదు. ఇప్పుడదే ప్లాస్టిక్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పర్యావరణానికి ముప్పుగా మారుతోంది. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమే కాదు..అత్యంత ప్రమాదకరం కూడా. అందుకే.. ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నాయి ప్రభుత్వాలు.
ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, మూగ జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే..! ప్లాస్టిక్ భూతం ఎంత ప్రమాదకరంగా మారుతుందో కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన ఘటన కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. ఒక గోవు కడుపులో నుంచి 70 కేజీలకు పైగా ప్లాస్టిక్‌ను తొలగించారు వైద్యులు. గోవు ప్రాణాన్ని కాపాడారు .
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రోడ్డుపై పడి ఉన్న ఒక గోవును చూశాడు స్థానిక న్యాయవాది బోయ తిమ్మప్ప. భారీ కడుపుతో ముక్తాయాసంతో నడవలేక అవస్థపడుతున్న గోవును చూసి చలించిపోయాడు. ఆవును చూసి తన దారి తాను పోలేక స్థానిక పశు వైద్య అధికారులకు సమాచారం ఇచ్చారు. పరిశీలించిన పశు వైద్యులు హుటాహుటీన అక్కడికి చేరుకుని గోవు పరిస్థితిని గమనించారు. వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అక్కడికక్కడే ఆవుకు శస్త్రచికిత్స చేసి, దాని కడుపులో నుంచి 70 కేజీల పైగా పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను తొలగించారు. దీంతో చావు బతుకుల్లో ఉన్న గోవుకు పశువైద్యులు ప్రాణభిక్ష పెట్టారు.
. ఆపరేషన్ చేసి మొత్తం ప్లాస్టిక్ అంత తొలగించారు డాక్టర్లు. ప్రస్తుత గోవు ఆరోగ్యం నిలకడగా ఉందని పశు వైద్యులు చెప్తున్నారు. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని, ప్రజలు కూడా అమలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. గోవు పట్ల న్యాయవాది చూపిన చొరవకు పలువురు అభినందించారు. మిగిలిపోయిన ఆహారం లేదా ఇతరత్రా ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ప్రజలు రోడ్లపై పారవేస్తుంటారు. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న ఆహారం తోపాటు ప్లాస్టిక్‌ను కూడా గోవులు తెలియకుండా తినేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎమ్మిగనూరు ఆవు సైతం ఫ్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో, కొంచెం కొంచెం పేరుకుపోయి మొత్తం కడుపు నిండింది. ఇతర తిండి తినలేక, తిన్నా కూడా అరిగించలేక ఆవు అనారోగ్యంతో పడిపోయింది