ఏపీలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హోంమంత్రి వంగలపూడి అనిత గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లు కోర్టు కేసుల్లో ఉన్న నేపథ్యంలో వీటిని పరిష్కరించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది అని వెల్లడించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో భాగంగా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. రాష్ట్రంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల ఆపడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అలాగే గంజాయి నిర్మూలనపై కూడా దృష్టి పెడతామని కూడా హోంమంత్రి పేర్కొన్నారు.నిజానికి గతంలో వైసీపీ ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నించినా కోర్టు కేసుల కారణంగా అది ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కోర్టు కేసులపై దృష్టిసారిస్తే ఇప్పటికే జారీ అయిన 6100 పోస్టుల భర్తీ అయినా ముందుకెళ్తుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 20 వేల వరకూ పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ తో పాటు ఇతర విభాగాల్లోనూ ఈ ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో ప్రయత్నాలు ప్రారంభించబోతోంది.