ఏపీలో తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాల ఇవ్వడం పై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఎన్నికల్లో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చాలా ప్రయత్నిస్తోంది.ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ ఇవాళ సాప్ట్ వేర్ నిపుణులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఐటీ సంస్థ హెచ్సీఎల్ ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్.. అనంతరం కీలక ప్రకటన చేశారు.
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్ సిఎల్ ఏపీలో తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధమవుతోంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం 4,500 మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భారీఎత్తున తమ సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించించింది. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ తో సంస్థ ప్రతినిధులు ఇవాళ భేటీ అయ్యారు.ఏపీలో విస్తరణ ద్వారా మరో 5500 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్సీఎల్ సంస్థ ప్రతినిధులు వెలువరించారు.రెండో దశలో కొత్త కార్యాలయ భవనం నిర్మించి మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ట్రెండ్స్ కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సస్ , స్కిల్ డెవెలప్మెంట్ లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామన్నారు.
అనంతరం నారా లోకేష్ స్పందిస్తూ… గత టీడీపీ హయాంలో అనేక రాష్ట్రాలు పోటీపడినా తాను స్వయంగా వెళ్లి హెచ్ సి ఎల్ ఛైర్ పర్సన్ శివ్ నాడార్ తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని గుర్తుచేశారు. రికార్డు టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి, యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం మంచి అనుభూతిని ఇచ్చింది అన్నారు.మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సంస్ధకు సూచించారు. అందుకు అవసరమైన పూర్తి సహకారం తమ ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పారు.