మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ఈ అలవాటును మాత్రం మానుకోరు. మద్యపానం శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే మద్యపానంతో కొందరు సోడా కలుపుకొని తీసుకుంటారు. సోడా కలుపుకొని తీసుకోవడం వల్ల మద్యం గాడత తగ్గుతుందని, రుచి వస్తుందని కొందరు భావిస్తుంటారు. ఇంతకీ మద్యంలో సోడ కలుపుకొని తాగితే ఏమవుతుంది.? దీనివల్ల ఏమైనా లాభాలు ఉంటాయా.? అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మద్యంలో సోడా కలుపుకొని తాగడం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. సహజంగానే సోడా అనేది ఒక కార్బోనేటెడ్ డ్రింక్. సోడాలో ఉండే బబుల్స్ కారణంగా శరీరం ఆల్కహాల్‌ను త్వరగా గ్రహించేలా చేస్తాయి. ఈ బబుల్స్ మద్యం పొట్ట నుంచి చాలా త్వరగా పేగులకు వెళ్లేలా చేస్తాయి. దీంతో మద్యం చాలా వేగంగా శరీరంలోకి వెళ్తుంది. ఫలితంగా త్వరగా మత్తు ఎక్కే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో త్వరగా నియంత్రణ కోల్పోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.ఇదే కాకుండా సోడాతో కలిపి మద్యం తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బిన భావన కలుగుతుందని అంటున్నారు. ఇక సోడాలో ఉండే ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనే చక్కెర కారణంగా బరువు పెరగడం, షుగర్ వ్యాధి రావడం వంటి సమస్యలు వస్తాయి. సోడాతో కలిపి మధ్యం సేవిస్తే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇక సోడాలో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ ఎముకల ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. మూత్ర పిండాల ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తాయి. ఇక దంతాల ఆరోగ్యాన్ని కూడా సోడా దెబ్బ తీస్తుంది.
వీటితో పాటు సోడాలో కేలరీలు ఎక్కువుగా ఉంటాయి. మద్యంతో కలిపి తీసుకుంటే ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో బరువు పెరగడంతోపాటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా సోడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సోడాలో ఉండే బబుల్స్, యాసిడ్స్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీని ఫలితం.. అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.