హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేస్తోన్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌వోడీ, రాజ్‌భవన్ ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది హైదరాబాద్ నుంచి అమరావతికి ఉద్యోగులు వచ్చారు.
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికి 2024 జూన్ 27 నుంచి వచ్చే ఏడాది జూన్26 వరకు ఉచిత వసతి వర్తిస్తుందని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత వసతిని గత పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. మరో ఏడాది పొడిగించడంతో అమరావతి ఉద్యోగులు ఖుషీ అవుతున్నారు.