రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ చేసిన రూ. 2 లక్షల రుణమాఫీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.రుణమాఫీ విజయవంతం అయిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం కాలేదని, కాకపోతే వారి కుటుంబ పర్యటన మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అయిందన్నారు.
ఆదాయపు పన్ను చెల్లించలేదని, రేషన్ కార్డులేదని చాలా మంది రైతులకు రుణమాఫీ చేయలేదని కెటిఆర్ పేర్కొన్నారు. అర్హులందరికీ రుణమాఫీ అయిందని రేవంత్ రెడ్డి నిరూపిస్తే, తాను తన ఎంఎల్ఏ పదవికి రాజీనామాచేస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని కెటిఆర్ స్పష్టం చేశారు. సెక్యూరిటీ లేకుండా ఏ నియోజకవర్గానికి అయినా మీడియాను తీసుకొస్తే చర్చకు తాము సిద్ధమని కూడా వ్యాఖ్యానించారు.