విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. గతేడాది సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్ తిరిగి ఏడాది విరామం తర్వాత ఈ సినిమాతో మళ్లీ సంక్రాంతికే వచ్చేసింది. సైంధవ్ నిరాశపరచడంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని వెంకీ ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీని అద్భుతంగా పండించడంలో సిద్ధహస్తుడు కావడం, ట్రైలర్ హిట్ అవడం, పాటలు ట్రెండ్ క్రియేట్ చేయడంతో కుటుంబ ప్రేక్షకులంతా ఈ సినిమా చూసేందుకే మొగ్గుచూపుతున్నారు. 14వ తేదీన రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బుక్ మై షోలో టికెట్లు అమ్ముడుపోతున్నాయి తెలుస్తుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ స్వరాలందించారు. ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చాలాకాలం తర్వాత పూర్తిస్థాయిలో ఒక కామెడీ చిత్రాన్ని చూశామని, కడుపుబ్బా నవ్వుకున్నామని చెప్పినట్లు సమాచారం. వెంకటేష్ కామెడీ బాగా చేస్తాడని మనఅందరికి తెలుసు. ఇందులో వెంకీ కామెడీ టైమింగ్ తోపాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ అనే రీతిలో వచ్చాయంటున్నారు. మొదటి నుంచి చివరి వరకు సినిమాలో హాస్యానికి కొదవ లేదన్నారు.
సినిమాలో హాస్యాన్ని పంచే సన్నివేశాలతోపాటు థ్రిల్లింగ్ పంచే సన్నివేశాలు కూడా ఉన్నాయని, మొత్తంగా ప్రేక్షకులంతా సకుటుంబ సపరివారంతా ఈ సినిమా చూసి ఆనందించవచ్చని సెన్సార్ సభ్యులు అన్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాను చాలా విభిన్నంగా ప్రమోట్ చేశారు. టీవీల్లో కార్యక్రమాలను ఉపయోగించుకోవడం, రీల్స్ చేయడం, ఇంటర్వ్యూలన్నీ చాలా ఫన్నీగా రూపొందించడంలాంటివన్నీ కలిపి ఈ సినిమాను విడుదలకు ముందే ప్రేక్షకులకు దగ్గర చేశాయి.విడుదలైన తర్వాత ఈ సినిమాకు అంచనాలకు తగినట్లుగా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి. విడుదలైన తర్వాత ఈ సినిమాకు అత్యధిక రోజులు లాంగ్ రన్ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.