2010 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత మళ్ళీ ఒక బహుళ క్రీడా ఈవెంట్‌కి ఆతిథ్యమివ్వడానికి భారత్ సిద్ధమవుతోంది! 2036 ఒలింపిక్ క్రీడలను భారత్‌లో నిర్వహించాలనే ఉద్దేశంతో ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి (ఐఓసీ) ప్రతిపాదన పంపించింది. ఈ ప్రతిపాదనలో అహ్మదాబాద్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుని విశ్వక్రీడల నిర్వహణకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
అహ్మదాబాద్ ప్రధాన వేదిక, మరికొన్ని నగరాల్లో ఈవెంట్లు
ఒలింపిక్ క్రీడలను ఒక నగరంలోనే కాకుండా, పలు నగరాల్లో నిర్వహించే అవకాశం 2014లో ఐఓసీ ఆమోదించింది. ఇదే విధానాన్ని అనుసరించి, భారత్ విజయవంతంగా హక్కులు గెలుచుకుంటే, పలు నగరాల్లోని మౌలిక వసతులను వినియోగించి ఈవెంట్లను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
- హాకీ: ఒడిశాలో
- రోయింగ్: భోపాల్‌లో
- కనోయింగ్, కయాకింగ్: పుణెలో
క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్ ఈవెంట్లకు ప్రాధాన్యత
క్రికెట్ వంటి క్రీడలు ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో నిర్వహించాలని ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. అలాగే, ఇండోర్ ఈవెంట్ల కోసం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రధానంగా ఉపయోగించాలని భావిస్తున్నారు.
అధికారిక ప్రణాళిక త్వరలో
ఒలింపిక్స్ నిర్వహణకు అవసరమైన సమగ్ర ప్రణాళికను అధికారులు త్వరలోనే ఐఓసీకి సమర్పించనున్నారు. ఇప్పటికే 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజిలెస్‌లో, 2032 ఒలింపిక్స్ బ్రిస్బేన్‌లో జరగనున్నాయి. అయితే, 2036 ఒలింపిక్స్ కోసం భారత్‌తో పాటు దక్షిణ కొరియా, మెక్సికో, ఇండోనేసియా, తుర్కియే, పోలెండ్, ఈజిప్ట్ వంటి దేశాలు పోటీపడుతున్నాయి.